Thursday, 9 January 2014

పుష్పం సమర్పయామి

పూజ మొదలుపెట్టాలన్నా,

వ్రతం మొదలుపెట్టాలన్నా, ముందుగా త్వరగా నాలుగు పూలు కోసుకుని తీసుకువస్తాం.ఒక వేళ ఏ పువ్వు ఐనా మాట్లాడగలిగితే ?!

ఆ ఆలోచనే ' పుష్పం సమర్పయామి '.


నను తాకినంతలోనే అత్తరులు విదజిమ్ముతుంది ప్రాణవాయువు .

నా వర్ణాలను చూసి సంబర పడుతుంది వర్ణణాతీత సూర్య కిరణం.

నేను వికసించుట చూసి మురిసిపోతుంది మన తల్లి  భూమి.

వీరిని వీడి పోను , మొక్కను వదిలి రాను అన్నా నీకు నాగోడు పట్టదా?

నన్ను నా వారి నుండి వేరుచేసి నీ పూజ మందిరానికి లాక్కుని వచ్చావెందుకు?

నన్ను భగవంతునికి అర్పించ నిస్చయించావా?

నా జాతి పుట్టిందే భగవంతుని పాదాల చెంత చేరే అద్రుష్ఠం పొందటానికి అని నిర్ణయించేసిన నువ్వు,నీ అద్రుష్ఠాన్ని మాత్రం థనం,సంపదకే ఎందుకు అంకితం చేస్తావు ?

నీ పుట్టుక ఎందుకో ఎందుకు నీకు అఖ్ఖరలేదు?

 నీ శాస్త్రాలు నన్ను దైవానికి అర్పించమన్నది వాస్తవమే,కానీ ' పుష్పం సమర్పయామి ' అన్న వాక్యంకన్నాముందు ' ధ్యానం సమర్పయామి ' అనే వాక్యంకూడా  ఉందని ఎలా మరిచిపోయావు?


నువ్వు పూజ అని అనుకుంటున్న ఈపనిలో,

నీకళ్ళు నిమిషానికి ఒకసారి ఘడియారం వైపు చూస్తూ త్వరగా పూజముగిచమన్నది.

నీ శ్వాస వంటింట్లో వండబడుతున్నపదార్థాల సంగతేంటో తెలుసుకోకుండా రానంది.

నీ చెవులు పక్కంట్లో జరుగుతున్నగొడవను ముందు ఆశక్తిగా వినమంది.

ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటుంటే ,నువ్వు నీచేతిలో ఉన్న నన్ను  దైవానికి సమర్పంచబోతున్నావా?

 నీలో ఉన్న నీసొంతమైన ఇంద్రియాలలో ఏఒక్క దానైనా ఏ కొద్దిపాటి సమయంలోనైనా భగవంతునిపై లగ్నం చేయలేని నీవు పరాయి వస్తువునైన నన్నుఎలాసమర్పిచగలవు?


నిజానికి ఒక చిత్రకారుడు అందంగా గీసిన రంగుల చిత్రపఠం మీద నా రంగులు కూడా జత చేసి ఆచిత్రానికి మరిత వన్నె తేగలవేమోకాని నన్నుపరమాత్మకు అర్పిచుట నీకు సాథ్యమా.

నీవనుకుంటున్న నీ దేవుడు కేవలం ఈచిత్రపఠంలోనే ఉన్నాడని, నను పుట్టిచిన మొక్కలో,నీనుంచి ననుకాపాడటంలో తన ఒంతు సాయం చేసిన ముల్లులోనూ లేడని ఖచ్ఛితంగా చెప్పగలవా?


నీవు స్వార్ధపూరిత పూజారివైతే నీఊపిరిసైతం నాకు భారం.

నీవు అందరిలో దైవం చూస్తే ఇక నాఅవరం నీకుఉండబోదనేది నిజం.